Monday, December 29, 2014

సంవత్సా రావు



సంవత్సా రావు


ఈ వారం అంతా ఎక్కడ చూసినా ఒకటే సందడి.  వచ్చేస్తున్నాడు, వచ్చేస్తున్నాడు, సంవత్సా రావు వచ్చేస్తునాడు అని. ఇక నరసింహ నాయుడి గారింట్లో సందడికైతే లెక్కే లేదు. ఎవరిని చూసినా హడావిడిగా వాళ్ళ వాళ్ళ ప్రయత్నాలలో మునిగి పోయి పరిగెడుతూ పక్కన ఏవరు వున్నారో కూడా చూసుకోకుండా తగులుకుంటూ వెళ్తున్నారు. నాకైతే నిలుచునే చోటు కూడా లేదు. ఎక్కడ నిల్చున్నా ఎవరో ఒకరు రావడం, నన్ను పక్కకు జరిపి అక్కడ ఎదో ఒకటి సర్ది పోవడం జరుగుతుంది.  అలా అని నరసింహ నాయుడు గారి దేమీ చిన్న ఇల్లు కాదు. లంకంత కొంప, ఉమ్మడి కుటుంబం, ఐదుగురు సంతానం. మాట వరసకి ఊర్లో వాళ్ళు పంచ పాండవులు అని ఏ ముహూర్తాన అన్నారో కానీ వాళ్ళ పెద్దబ్బాయికి మాత్రం ధర్మరాజు పోలికలే వచ్చాయి. అదీ జూదంలో. అయన గారి హడావిడి అంతా ఇంతా కాదు. అయన గది మొత్తం ఎరుపు, ఆకూ పచ్చ రంగుల బల్లలతో కేసినో లాగా తయారు చేసాడు. సంవత్సారావు రాగానే పోయిన సారి కంటే రెండింతలు పందెం పెంచి పోయిన ఏడాది పోగొట్టుకున్నదంతా వడ్డీ తో సహా సంపదించేయాలని ఆయన ఆశ. ఒక సారి ఒడ్డున పడ్డాక ఇంకా జూదం వదిలేసి వాళ్ళ రైస్ మిల్ బిజినెస్ చూసుకోవాలని ఆయన కోరిక. 
ఇంక వాళ్ళ రెండో అబ్బాయి వస్తాదు కాక పోయినా మాంచి భోజన ప్రియుడు. పొద్దున్న లేచినప్పడినుంచీ పంచేంద్రియాలూ షడ్రుచుల ప్రదక్షినే. వయసులో వున్నప్పుడు బాగా తిని దానికి తగిన వ్యాయామం, పని చేయడంతో మనిషి మాంచి కడ్డీ లాగా ఉండేవాడు. బజారులో నడుస్తూంటే ఎన్ని సొగసరి  కండ్లో వేటాడేయి. ఇప్పుడు పనీ, వ్యాయామం రెండు తగ్గి వయసు పెరిగేసరికి కడ్డీ లాంటి వళ్ళు కాస్తా కుండ దిశగా పరిగెడుతుంది. ఈ సారి సంవత్సారావు ఎంత తిన్నా వళ్ళు ఏమీ పెరగని కొత్త కొత్త రుచులన్నీ తీసుకోస్తాదనీ ఈయన ఆశ. అలా ఒక్కసారి కొత్త రుచులన్నీ చూశేసి మళ్ళీ వ్యాయామం మొదలు పెట్టి కుండని కాస్తా కడ్డీ లాగా మార్చాలని నిర్ణయం. ఇంక అయన గదిలో షడ్రుచుల విందు ఏర్పాటు చేసాడు. సంవత్సారావు ని ప్రసన్నం చేసుకోవాలని తన దగ్గిరే వుంచేసుకోవాలని ఈయన ఉబలాటం. ఇక మూడో అబ్బాయిది మంచి ఉద్యోగం విలాసవంతమయిన జీవితం. పగలు ఎక్కడవున్నా సాయంత్రానికి క్లబ్ చేరి ఖరీదయిన విస్కీ, విదేశీ సిగార్ లతో సావాసం. తన క్లబ్ లో వాళ్ళంతా ఎంతగానో ఆరాదించే సంవత్సారావు రాగానే గ్రాండ్ గా బ్లూ లేబిల్, క్యూబన్ సిగార్స్ తో పార్టీ ఇచ్చేసి తన ఇమేజ్ ని బాగా పెంచుకొని క్లబ్ ప్రెసిడెంట్ గా ఎన్నిక అవ్వాలని అయన తాపత్రయం. ఎమాటకి ఆమాటే చెప్పుకోవాలి. సంవత్సారావు పార్టీలో వుంటే ఆ కిక్కే వేరప్పా అని క్లబ్ లో అందరూ అంగీకరిస్తారు.
ఇక నాలుగో అబ్బాయికి ఈ ఏడాదే ఉద్యోగం వచ్చింది. ఇప్పడివరకూ ఉద్యోగం లో ఏమీ కుదుట పడలేదు. పోయిన సారి సంవత్సారావు తనను చాలా బాగా గైడ్ చేసి ప్రామిస్ కూడా తీసుకున్నాడు. ఉద్యోగం రాగానే చాలా కష్టపడి పని చేస్తాననీ, బోనస్ కూడా తెచ్చుకున్తాననీ తనకి ప్రామిస్ చేసాడు. అవేమీ జరగలేదు. తనతో పాటు జాయిన అయిన అందమైన అమ్మాయిల మీద శ్రద్ధ కొంచెం తగ్గించమని మొన్ననే మేనేజర్ చెప్పాడు. అందుకనే ఈ సారి సంవత్సారావు ని వదలకుండా తన గైడెన్స్ తీసుకోవాలని, బోనస్ కొట్టేయ్యాలనీ డిసైడ్ అయ్యాడు. తన గది నిండా కొత్త కొత్త సరదా ఆటలను రెడీ చేసాడు. ఇక చిన్న అబ్బాయి LLB ఫైనల్ ఇయర్. చదువుకూ, సరదాలకూ సమంగా న్యాయం చేసే వ్యక్తి. పోయిన సారి సంవత్సారావు కి ఒక ఫామ్ హౌస్ లో పార్టీ ఇచ్చి 2nd ఇయర్ లో టాప్ రాంక్ కోరుకున్నాడు. ఆ ఫాం హౌస్ పార్టీ లో మొదలైన పరిచయాలతో తిరిగేసరికి అది కాస్తా టాప్ 10 రాంక్ లో కి వచ్చాడు. ఈ సారి సంవత్సారావు ని బాగా కాకా పట్టేసి చాలా బాగా చదివి ఫైనల్ ఇయర్ కల్లా టాప్ అవ్వాలని ఈయన స్ట్రాటజీ. వీళ్ళందరినీ మించిన మహా తెలివిగల్ల వ్యక్తి ఇంకొకరు వున్నారు. ఆవిడే వీళ్ళందరినీ కన్న తల్లి లక్ష్మమ్మ గారు. ఈ సంవత్సారావు ని తన దగ్గిరే పెట్టుకొని శ్రీ సూక్తం తో మొదలు పెట్టి సహస్ర నామాలవరకూ అన్నీ కంటతా నేర్చేసుకోవాలని, దసరాకు లలితా సహస్రనామం గుడిలో పుస్తకం చూడకుండా  చదవాలనీ ఆవిడ ఆశ. పూజ గది తో పాటు పరిసరాలన్నీ ముగ్గులు వేసి పూల మాలలతో అలంకరించి ఎప్పుడెప్పుడా అని కళ్ళలో వత్తులు వేసుకొని ఎదురు చూడటం మొదలు పెట్ట్టింది.

అయితే వీళ్ళందరూ ఎదురు చూస్తున్న సంవత్సారావు అనుకోకుండా ఏమీ రావడం లేదు. అయన వస్తున్న తేదీ సెకన్లతో సహా అందరికీ తెలుసు. పోనీ కొన్ని రోజులే వుండి వెళ్ళిపోతాడా అంటే అదీ కాదు. చాలా రోజులు ఉంటాడాయె. మరి అది తెలిసి కూడా వీళ్ళందరూ ఇంత ఆసక్తిగా ఆ వచ్చే రోజు కోసం ఎందుకు చూస్తున్నారో అది మాత్రం నాకు అర్ధం కావడం లేదు. నాకు మరీ అసలు అర్ధం కాని విషయం ఏమిటంటే సరిగ్గా ఒక ఏడాది క్రితం కూడా సంవత్సారావు వచ్చాడు. అప్పుడు కూడా వీళ్ళు అందరూ ఇలానే హడావిడి చేసారు. వచ్చీ రాగానే అందరూ తనని గట్టిగా  పట్టేసుకున్నారు. సరిగ్గా ఇలాంటి ఏంటి, ఇంచు మించు ఇవే నిర్ణయాలు తీసుకున్నారు. ఏమి ఉపయోగం? మొదటి నెల నెత్తిన పెట్టుకున్నారు. రెండో నెలకు మొహమాటంగా చూశారు. మూడో నెలకు మర్చి పొయ్యారు. తనకి ఇచ్చిన మాటలు, కలిసి చేద్దామనుకున్న పనులు, సరదాలు అన్నీ వదిలేశారు. కొన్నాళ్ళకి తను అటు వస్తుంటే వీళ్ళు ఇటు వెళ్ళడం మొదలు పెట్టారు. ఆరో నెల కళ్ళా వాడిని అటక ఎక్కించేశారు. తర్వాత మూడు నెలలూ ఎవరి వేసవి సెలవలలో వాళ్ళు పడిపోయి అన్ని నిర్ణయాలూ మరిచిపోయారు. ఇంక చివరి మూడు నెలలైతే వాడిని కాగితం మీద గీత వరికే పరిమితం చేసి వచ్చే వాడి కోసం ఎదురు చూడ సాగారు.


ఇంతకీ నేనేవరంటారా? ఇంతకు ముందు చెప్పానే? పోయిన ఏడాది కూడా ఒక సంవత్సారావు వచ్చాడని. వాడిని అటక ఎక్కించారని. అది నేనే. నా పేరు కూడా సంవత్సారావు. కాకపోతే మా ఇంటి పేరు పాత. ఇప్పుడు వచ్చే వాడి ఇంటి పేరు కొత్త. ఈ కొత్త సంవత్సారావు కి స్వాగతం కోసం బూజు దులుపుతూ నన్ను అటక దింపారు. ఇప్పుడు నా గురించి పట్టించుకొనే నాధుడే లేడు. అందరూ ఆ కొత్త సంవత్సారావు కోసం ఎదురు చూపులే. వాడూ మావాడే. వరసకు తమ్ముడు అవుతాడు. నేను వాడికంటే కరెక్ట్ గా ఒక సంవత్సరం పెద్ద. ఎంతైనా అన్నయ్యను కదా, వాడి పరిస్థితి కూడా నాలాగే అవుతుందేమో, వాడిని కొంచం జాగ్రత్తగా ఉండమని వాడికి చెపుదామంటే ఎక్కడా మమ్మల్ని కలవనియ్యరు. సరిగ్గా అర్ధరాత్రి కాగానే దీపాలన్నీ ఆర్పేసి అప్పుడు మార్చ్చేస్తారు మమ్మల్ని. నన్ను బయటకు నెట్టడం, వాడిని లోనకు గుంజడం ఒకేసారి జరిగిపోతుంది. అదేగా నా ముందు వాడికి కూడా జరిగింది. ఇది ఇంకా నయం. న్యూ యార్క్ లో అయితే పాత సంవత్సరం ని, పాత నిర్ణయాలనూ అన్నీ ఒక కాగితం పై వ్రాసి దాన్ని మంటలో వేస్తున్నారట. పాత నిర్ణయాల్ని, పాత పద్దతుల్నీ మొత్తం మర్చిపోయి కొత్త నిర్ణయాలు మంచిగా  తీస్కోవడానికంట. ఎంత ఘోరం. పాత సంవత్సారావంటే అంత చులకనా? ఇప్పుడు కరుణ శ్రీ గారే వుండి వుంటే మా భాదల్ని చూసి 'సంవత్సర విలాపం' అని కావ్యం రాసి ఉండేవారు కాదా. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. ఇంతమంది తెలుగు భాషా పరిరక్షకులు వున్నారు కదా. మీలో ఎవరో ఒకరు ఆ పని చెయ్యండి. చూశారా, వెళ్లిపోయ్యే ముందు కూడా నేను మీకు ఎంత మంచి ఐడియా ఇచ్చి వెళ్తున్నానో. ఇక ఇప్పుడు నేను  చెయ్యగలిగింది, ఒక మూలాన నిల్చుని కొత్త సంవత్సారావు కి అంతా మంచి జరగాలని వీళ్ళ అందరికీ, మీ అందరికీ మా తమ్ముడు బాగా ఉపయోగ పడాలనీ కోరుకోవడం మాత్రమే. మీరు మాత్రం కొత్త సంవత్సారావు ని ఏమాత్రం వదలకండి. నాకన్నా భద్రం గా చూసుకొని కొత్త సంవత్సరం మొత్తం మీ దగ్గిరే పెట్టుకొండి. ఈ సారి మా తమ్ముడు మీకు సంతోషంగా వీడ్కోలు చెప్పేలాగా మీరందరూ మీ నిర్ణయాలను పట్టు వదలకుండా అమలు పరచాలనీ, మీ కోరికలలో సఫలం కావాలని, మీ ఆశలన్నీ నేరవేరాలనీ నా కోరిక(మై న్యూ ఇయర్ విష్).  మీరందరూ వాడిని ఎంతో మురిపెంగా చూసుకోవాలని, వాడితోపాటు మీరందరూ అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలనీ దేవుడిని ప్రార్దిస్తూ సెలవ్!