Wednesday, February 24, 2021

నాన్నా ఎక్కడ వున్నావురా?

 

నాన్నా ఎక్కడ వున్నావురా? ఎక్కడ వెతకాలి రా నిన్ను?
ఒక్క మాటైనా చెప్పలేదే, వీడ్కోలు చెప్పడానికి కూడా వీలివ్వ లేదే
ఇంత తొందరగా, అంత అందనంత దూరాలకు వెళ్ళాలా?

నా కుడి, ఎడమ, రెండు భుజాలూ నువ్వే అనుకున్నానే
జీవితంలో పెద్ద లోటుగా వున్నా కన్న పేగు తోడు దొరికిందనుకున్నానే

ఎంత అపురూపంగా పెంచుకున్నా నిన్ను, అంతకన్నా అణకువగా పెరిగావు నువ్వు
చేతికి అంది వచ్చావు, ఇంటికి మరో పెద్ద తోడు అయ్యావు, ఎందరినో మెప్పించావు

నువ్వు ఎదగాలనుకున్నాను కానీ, మరీ ఇంత అందనంత ఎత్తుకా
పైకి, పైపైకి చేరాలనుకున్నాను కానీ, మరీ ఇంత దూర తీరాలకా?

నా భాద్యత, నా గర్వం, నా సర్వం అన్నీ నువ్వే అనుకున్నాను
నువ్వు ముందు నడుస్తుంటే, గర్వంగా నీ వెనక నడుద్దామనుకున్నాను

ఒక్కసారి  కూడా వెనక్కి చూడకుండా, ఒంటరిగా వదిలేసి వెళ్ళావే
నా నమ్మకాలన్నీ వమ్ము చేసి, వదిలేసి వెళ్తావా? ఇది న్యాయమా?

నాన్న గట్టివాడనీ, ఎంత కష్టాన్నైనా భరిస్తాడని, అయినా జయిస్తాడనీ
నాపై నీకున్న నమ్మకమా? లేక దేవుడితో కలిసిపోయి నన్ను పరీక్షిస్తున్నావా?

ప్రతి పనిలో నా అంచనాని మించి వెళ్ళావు, బ్రతుకు పయనంలో కూడా నన్ను దాటి వెళ్ళాలా
అందరి గురించి ఆలోచిస్తావే, అందరినీ గుర్తుంచుకుంటావే, ఆ అందరిలో నేను లేనా?

ఏమో, ఎక్కడ వున్నా సంతోషంగా వుండు, నీ తత్వమే అది
మళ్ళీ ఎప్పుడు కలుస్తామో, అంతవరకూ నిన్ను వెతుకుతూనే వుంటాను...

     నిన్ను ప్రతీక్షణం వెతికే నా కంటి రెప్పల వెనుక,
     నిన్ను మర్చిపోలేని నా మది తలపుల తలుపుల వెనుక
     నీవు మిగిల్చిన శూన్యం భారాన్ని మోయలేని నా గుండె గదులలో

నిన్ను వెతుకుతూనే వుంటాను. ఎప్పుడో ఒక్కసారైనా కనపడకుండా వుంటావా?
అందుకే నిన్ను వెతుకుతూనే వుంటాను...

ఇట్లు,
నాన్న



... చేతికి అందిన కొడుకు దూరమైన భాధలో వున్న నా ప్రియ మిత్రుడి తీర్చలేని శోకానికి, నా ఊహకందని ఆవేదన...



No comments:

Post a Comment