Thursday, December 6, 2012

దాదా

                                                        దాదా

రేపు అసలే గుడ్ ఫ్రైడే సెలవు. ఈ రోజు చాలా పని వుంది అంటూ తను కంగారు పడుతుంటే గేటు దాక వెళ్లి వాళ్ళ ఆయనను ఆఫీస్ కి పంపించి వచ్చింది లక్ష్మి. ఆ రోజు ఎంత పని వుందో తనకు అప్పుడు గుర్తుకు వచ్చింది. ఆ రోజు తనకు ఇష్టమైన దాదా ఇంటికి వచ్చే రోజు. వంట చేసి, ఇల్లు శుభ్రం చేసేసరికి అలసటగా అనిపించింది. ఇంకా కొంత వంట మిగిలే వుంది. స్నానం చేసి ప్రశాంతంగా మిగిలింది చెయ్య వచ్చు అని స్నానం చేసి, మిగిలిన వంట పూర్తి చేసే సరికి మధ్యహ్నం దగ్గిర పడింది. ప్రక్క గదిలో వాళ్ళ అబ్బాయి సత్యా చదువుకుంటున్నాడు. వంట గది, ముందు గది అంతా మళ్ళా సర్ది తనకిష్టమైన వ్యక్తి కోసం ఎదురు చూడటం మొదలుపెట్టింది. ఈ లోపులో ముందు గదిలో వున్న చెక్కబల్లను మరొకసారి తుడిచి అంతా కరెక్ట్ గానే వుంది కదా అని చూసుకుంది. సమయం గడుస్తున్నకొద్దీ  తనలో కొంచం ఆనందంతో కూడిన కంగారు మొదలైంది. అలా చూసేసరికి తన మనసులోని ఆనందం చిరునవ్వుగా పెదాల పైకి వచ్చింది. ఎదురుచూస్తున్న దాదా వచ్చేసాడు. దాదా ఆ వూరిలో అందరూ మా వాడు అనుకునే పెద్ద మనిషి.  చిన్నప్పుడు బాగా కుస్తీ పట్టేవాడట. ఒకసారి పోటీలో ఓడిపోయిన  తర్వాత ఇక కుస్తీ పట్టనంటూ మానేసాడు. ఇప్పుడు బాగా ముసలితనం వచేసింది. కానీ ఇప్పటికీ అందరూ దాదా అనే పిలుస్తుంటారు. తెల్లటి బట్టలు వేసుకొని ప్రశాంతంగా కన్పిస్తాడు. అందరికీ మంచి మాటలు చెపుతుంటాడు. ఎవరికీ ఏ సమస్య వచ్చినా ఓపికగా విని సలహా ఇస్తుంటాడు. దాదా అంటే వూరిలో అందరికీ గౌరవం. కుటుంబ వ్యక్తులు కూడా ఎవ్వరూ లేరు. వూరి బయట వున్న పాత బిల్డింగ్  లో ఉంటాడు. అక్కడికి దగ్గిర్లోనే వున్న రామచంద్రం గారు దాదా కి కావాల్సిన భోజనం, స్నానం వసతి చూస్తుంటారు. తనే వూర్లో అందరి గురించి పేరు పేరునా దాదా కి చెపుతూ వుంటారు.

దాదా ని బల్లపై కూర్చోబెట్టి తన ప్రశాంతమైన మొహం లోకి చూస్తూ ఎదురుగా కూర్చుంది లక్ష్మి. ఏమ్మా ఎలా వున్నావు? నువ్వు, మీ వారు, మీ అబ్బాయీ అందరు బాగున్నారా అన్నారు అన్నారు దాదా. అంతా క్షేమమే దాదా. ఇలా మీ పరిచయం వాళ్ళ, మిమ్మల్ని కలుస్తూ, మీ సలహాలు పాటిస్తూ బాగానే వున్నాం దాదా అని అంది లక్ష్మి. లేదమ్మా నీ మనసులో ఎదో ఆందోళన కనిపిస్తుంది అన్నారు దాదా. అవును దాదా, మా వాడు కాలేజీ ఈ సంవత్సరం పూర్తి అవుతుంది. డాక్టర్ చదువు కి సీట్ వస్తుందో లేదో అని దిగులుగా వుంది అంది లక్ష్మి. దానికి దాదా, శ్రద్ధ తో చదవమని చెప్పమ్మా. అంతా మంచే జరుగుతుంది. శ్రద్ధ ముఖ్యం. గుర్తు పెట్టుకో అని సత్యా తల నిమిరారు. పదండి దాదా భోంచేద్దాం అని లక్ష్మి అడగగానే సరేనమ్మ అలానే. అందరమూ కలిసి భోంచేద్దాం అన్నారు దాదా. అదే సమయానికి లక్ష్మి భర్త కూడా ఇంటికి వచ్చారు. వస్తూనే, ఇవ్వాల కంగారులో లంచ్ తీసుకెళ్లడం మర్చి పోయాను. దాదా వస్తున్నారు కాబట్టి నువ్వు స్పెషల్ లంచ్ చేస్తావు కదా. అలానే ఒక సారి దాదాని కూడా చూసినట్లుంటుంది అని అంటూ దాదా ఎదురుగా కూర్చున్నారు. లక్ష్మికి  తెలుసు తను లంచ్ కంటే, దాదా ని కలవడానికే వచ్చారు అని. దాదా అంటే తనకు కూడా  చాల గౌరవం. అందరూ  కలిసి భోంచేసారు. దాదా భోజనం అన్న మాటేకానీ ఆ పెట్టిన రెండు ముద్దలు కూడా సరిగా తినరు. కడుపు నిండి పోయిందంటూ నవ్వుతారు. తర్వాత దాదా సెలవు తీసుకోవడం తో లక్ష్మి భర్త కూడా ఆఫీస్ కి వెళ్ళిపోయాడు. దాదా వెళ్ళేటప్పుడు  తను దాదా కోసం కొన్న ఒక శాలువాను కూడా దాదా కి ఇచింది. అలా లక్ష్మి జీవితం వాళ్ళ కష్ట పడే గుణం తోటి, దాదా సన్నిహితం  తోటి మంచిగా జరుగుతుంది - వచ్చే తుఫాను గురించి తెలయకుండా.

ఆ శనివారం వాళ్ళకి తెలిసిన వారి గృహప్రవేశానికి వెళ్లి వస్తూ "వాళ్ళను చూశారా? మనతోటి వాళ్ళే. ఎంత పెద్ద ఇల్లు కొన్నారో? వాళ్ళకి బిజినెస్ లో బాగా కలిసి వచ్చిందంట. మీరు కూడా ఏదన్న బిజినెస్ చెయ్యండీ.ఇలా ఈ జాబు తో మనం ఎన్నాళ్ళకు ఇల్లు కట్టేది?" అంది లక్ష్మి. తన భర్త కూడా అఆలోచనలో పట్టాడు. అది చూసి లక్ష్మి ఆ వారం అంతా తనకు ఈ విషయమే గుర్తు చేస్తూ వచ్చింది. తర్వాతి వారం దాదా వచినప్పుడు లక్ష్మి, భర్త దాదా ని సలహా అడిగారు. ఏదైనా వ్యాపారం చేయ్యలనుకున్తున్నాము. ఏమంటారు అని. దానికి దాదా అలోచించి, ఏదైనా ఓపిక తో చెయ్యండి. ఓపిక ముఖ్యం సుమా అన్నారు. తర్వాత కొన్నాళ్ళు చాలా తొందరగా గడిచి పోయాయి. దాదా ఇచ్చిన ధైర్యం తో అయితేనేమి, వాళ్ళు ఎంచుకున్న వ్యాపారం వల్ల అయితేనేమి - తక్కువగా వచ్చినా, లాభాలు రావడం మొదలయ్యాయి. లక్ష్మి కూడా వ్యాపారం లో తన భర్త కు సహాయం చేస్తూ చాల కొత్త విషయాలు నేర్చుకుంది. ఊహించిన డబ్బు వచ్చింది, ఊహించని స్నేహితులు కూడా వచ్చారు.

కొత్త స్నేహితులు, కొత్త ప్రదేశాలతో ఒక్కో రోజు ఇంటికి రావడం బాగా ఆలస్యం అయ్యేది. కొన్ని సార్లు స్నేహితుల బలవంతం మీద వాళ్ళ ఇంట్లోనే వుండటం, ఆ తర్వాతి రోజు మధ్యాహ్నానికి రావడం జరిగేది. ఒకటి రెండు సార్లు, దాదా వాళ్ళ ఇంటి వేపు వచినప్పుడు కలవడం కూడా కుదర లేదు. అయ్యో, ఆలస్యం అయ్యిందే అనుకోని ఎవరన్నా అటు వెళుతుంటే, వాళ్లతో దాదా కి భోజనం పంపించేది. ఇలా వుండగా, ఎలాగూ లాభాలు వస్తున్నాయి కదా అని కొంచం అప్పు చేసి తాహతకు మించిన పెద్ద ఇల్లు కొని అందులోకి గృహ ప్రవేశం చేశారు. దాదా ని ప్రత్యేకంగా పిలిచి పట్టు బట్టలు పెట్టాలి అనుకున్నారు. కానీ గృహప్రవేశం రోజున హడావిడి లో దాదా ఎప్పుడు కూర్చునే చెక్క బల్ల ఎక్కడ పెట్టారో మర్చిపోయారు. దాదా ని సోఫా లో కూర్చోమంటే కూర్చున్నారు కానీ  ఇబ్బందిగా కనిపించారు. ఆ రోజు వచ్చిన అతిదుల విషయం లో పడి దాదా భోజనం చేసారో లేదో కూడా మర్చి పోయారు లక్షి, తన భర్త. కొద్దిసేపటికి గుర్తుకు వచ్చి చూస్తే దాదా కనిపించలేదు ముందు గదిలో. ఎవరితోటో భోంచేసి వెళ్ళిపోయారు అని చెప్పారు. అయ్యో, అందరి ముందు ఘనంగా పట్టు బట్టలు పెదదమనుకున్నాము కదా. వీలు కాలేదే అనుకుంది లక్ష్మి. ఆ రోజు సాయంత్రము రామచంద్రం గారు వాళ్ళ ఇంటి వేపు వచినప్పుడు, దాదా కి కొన్న పట్టు బట్టలు, కొన్ని దిండ్లు పంపించింది లక్ష్మి.

ఇంటికోసం చేసిన అప్పుపై వడ్డీలు పెరగటం తో, వ్యాపారం లో ఎక్కువ లాభాల కోసం ఇంకా కొంచం ఎక్కువ పెట్టుబడి పెట్టారు ఆది కూడా అప్పు చేసి. ఓపిక గా వుండటం కంటే, ఎక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభాలు వస్తాయి కదా అని ఆశ కలిగింది వాళ్లకి. కొన్నాళ్ళ తర్వాత చూస్తే, ఎక్కువ లాభాలు కాదు కదా, వడ్డీ మాత్రం ఎక్కువ కాసాగింది. అమ్మా, నాన్నా వ్యాపారం లో పడి పెద్దగా పట్టించుకు పోయేసరికి సత్యా చదువు కూడా మందగించింది. కొత్తగా వచ్చిన స్టేటస్ తో, కొత్త స్నేహితులతో చదువు మీద శ్రద్ధ చూపట్లేదు. పెరుగుతున్న వడ్డీలు గుర్తుకు రావడంతో, పెరిగిన స్నేహాల అలవాట్ల వళ్ళ తగ్గిన ఆరోగ్యం తో లక్ష్మి కి, తన భర్త కు సరిగా నిద్ర కూడా పట్టడం లేదు. ఇటు చుస్తే సత్యా చడువు పరిస్తితి కూడా అంత బాగా లేదు. అ రోజు అక్ష్మికి బాగా రాత్రవుతున్నా నిద్ర పట్టలేదు. కూర్చొని ఆలోచించింది. ఏం జరిగింది? సరిగ్గా సంవత్సరం క్రితం ఎంత ఆనందంగా వున్నాము? ఎందుకింత మార్పు? మనసుకు చాల చిరాకుగా అనిపించింది. ఒకసారి దాదా ని కలవాలి. మనసులో మాటను చెప్పుకోవాలి. తన సలహా తీసుకోవాలి అనుకుంది. అలా అనుకున్నతర్వాత కొంచం నిద్ర పట్టింది. ఉదయం లేచేసరికి బాగా లేట్ అయ్యింది. త్వరగా తయారు అయ్యి  దాదాని  కలవడానికి వెళ్ళింది. వెళ్ళే సరికి దాదా ఒక్కరే కూర్చొని వున్నారు. దగ్గిరకు వెళ్లి మాట్లాడే లోపులోనే కళ్ళ వెంట నీళ్ళు కారుతున్నాయి లక్ష్మికి. దాదా మాత్రం ఎప్పటి లాగే ప్రశాంతం గా వున్నారు. కంగారు పడకు కూర్చో,  నెమ్మదిగానే మాట్లాడు అన్నారు దాదా. ఏముంది దాదా చెప్పడానికి, మీరు చూస్తూనే వున్నారు కదా, మమ్మల్ని సమస్యలు చుట్టు ముట్టాయి. మనసు అంత బాగుండటం లేదు. మీరు ఇలా చూస్తూనే ఉంటారా? నా మీద కోపం వచ్చిందా? మీరు మా ఇంటికి కూడా రావడం లేదు. నేను పంపిన పట్టు బట్టలు కట్టుకోలేదు. నేను పంపించిన దిండు కూడా వాడటం లేదు. అని భాదగా అంది లక్ష్మి.

దాదా చిన్నగా ఇలా చెప్పారు. అమ్మా లక్ష్మీ, నీ మీద నాకు ఎందుకు కోపం? నాకు మాత్రం మీరు కాక ఎవరున్నారు? మిమ్మల్ని ఎప్పుడూ శ్రద్ధ తో, ఓపిక తో ఉండమని చెప్పను గుర్తుందా? మీరు కొన్ని పై పై మెరుగులకు పోయి కష్టాలు కొని తెచుకున్నావు అని నాకు తెలిసింది. నిన్ను కలుద్దామని, నీకు కొన్ని మంచి మాటలు చెపుదామని నేను అటు వచినప్పుడు మీ ఇంటి వేపు చాలా సార్లు చూసాను. నీవు ఆలస్యం గా లేవడం వల్ల  అయితే నేమి, ఇంటిలో లేక పోవడం వాళ్ళ అయితే నేమి  నిన్ను కలవడం వీలు కాలేదు. మీ గృహప్రవేశం రోజున అన్నా, కలిసి మాట్లాడు దామంటే, నువ్వు అతిదుల లో పడి మర్చి పోయావు. మొన్న పండుగ రోజు మీ పక్కింటి ఆవిడ ఇటు వస్తూ నిన్ను వస్తావా అని  అడిగింది గుర్తుందా? అది నేనే కబురు పెట్టాను. కానీ నీకు వీలు కాదు అన్నావట. అయినా కూడా, నేనే రేపు మళ్ళీ మీ ఇంటివైపు వద్దామనుకుంటున్నాను. నువ్వంటే నాకు అంత ఇష్టం.  నీ కష్టాల గురించి నేను ఆలోచించాను. శ్రద తో సత్యా ని చదవమను. దారిలో పడతాడు. వ్యాపారంలో ఓపిక గా వుండి ఖర్చులు, పెట్టుబడులు తగ్గించుకోండి. వ్యాపారం కూడా దారిలో పడుతుంది. మిమ్మల్ని ఈ కష్టాల నుండి నేను మీ చెయ్యి పట్టుకొని బయటకు తీసుకువస్తాను సరేనా. ఇక ఈ పట్టు బట్టలన్తావా, నువ్వు ప్రేమతో ఇచిన ఈ శాలువా మూడు ఎంత ఖరీదైన బట్టలైనా చిన్నవే అని అన్నారు దాదా.

లక్ష్మికి చిన్నగా అర్ధం అవ్వడం మొదలయ్యింది. ప్రశాంతం గా వున్నా తన జీవితం లో ఎప్పుడైతే  శ్రద, ఓపిక తక్కువయ్యాయో, తన జీవితం లోకి కష్టాలు వచాయని.  ప్రేమ అనేది ఎప్పుడైతే తగ్గి, గర్వం ప్రవేశించిందో తనకు దాదా దూరం అయ్యారని. కుడి భుజం మీద ఒక చినుగు పడినా కూడా, దాదా తను ప్రేమతో ఇచ్చిన బట్టలే వేసుకున్నారు. పక్కన వున్న ఇటిక మీదే చెయ్యి ఆనించారు కానీ తను నలుగురిలో గొప్పకోసం పంపిన దిండు కూడా వాడలేదు. దాదా నాకు చాలా బాగా చెప్పారు. ఇంకెప్పుడూ ప్రేమ, శ్రద, ఓపిక లేకుండా ఏ పనీ  చెయ్యను  దాదా. నన్ను ఎప్పుడూ వదలకండి దాదా అని మనసులోనే అనుకున్నా అది అప్రయత్నం గా పెద్దగా బయటకే వచ్చింది. అప్పుడే మెట్లు ఎక్కుతున్న రామచంద్రం గారు, ఎందుకమ్మా అంతగా భాధ పడుతున్నావు. దాదా కి మనసులో అనుకుంటే చాలు తెలిసిపోతుంది. బయటకు చెప్పాల్సిన అవసరమే లేదు అన్నారు.

అవును నిజమే, దాదా కి మాటలతో పనేముంది? ఎప్పుడైనా ఒక్క మాట ఐనా మాట్లాడితేకదా. మనం మనసులో అనుకుంటే దాదా కి వినపడుతుంది. దాదా ఎంత పెద్ద సమాదానం అయిన తన కళ్ళ తోటే మనకు చెపుతారు. ఒక్క మాట కూడా మాట్లాడడు. ప్రశాంతం గా కుర్చుని ఉంటాడు. ఆ కళ్ళలోకి ఒక సారి చూస్తె చాలు, మనసులో కష్టాలు అన్నీ తీరిపోయినట్లు గా అనిపిస్తుంది అనుకుంది లక్ష్మి. అంతలోనే, రామంచంద్రం గారు అడిగారు, ఈ రోజు బుదవారం. బుద్ధపూర్ణిమ, అర్చన చెయ్యమంటారా? అని అడిగారు. లక్ష్మి అప్పుడు అనుకుంది. ఈ రోజు నాకు కూడా జ్ఞానోదయం అయ్యింది. నేను ఈ రోజు త్వరగా ఇంటికి వెళ్ళాలి. మనసును ప్రశాంతంగా, ఇంటిని శుబ్రంగా వుంచుకొని రేపు దాదా ని మా ఇంటి కి ఆహ్వానించాలి. దాదా కి నైవేద్యం పెట్టి మా ఇంటిలో భోజనం చెయ్యాలి. చాలా పనులున్నాయి అనుకుంటూ మందిరం దిగి, ప్రక్కన విడిచిన చెప్పులు వేసుకొని ఇంటికి త్వరగా అడుగులు వెయ్యడం మొదలుపెట్టింది.  "పరవాలేదులే అమ్మా, మీ గోత్ర నామాలు నాకు గుర్తే వున్నాయి. నేను మీ పేర్లు కూడా చదువుతాలే  సాయంత్రం దాదా అర్చన లో" అని రామచంద్రం గారు అంటున్న మాటలు వినిపిస్తున్నాయి దూరంగా, మందిరం లోని అగరొత్తుల వాసన లాగా!



1 comment:

  1. Very good Mr. Basiv... I like it. Keep it up my friend!!!

    ReplyDelete